తిరుమల నుంచే ప్రాక్షలన మొదలు పెడతానని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .. ఆ దిశగా తొలి అడుగు వేశారు. టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలారావును నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. ఆయన 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. శ్యామలరావు ముక్కుసూటిగా వ్యవహరించడంతోపాటు విధుల పట్ల నిబద్దత, చిత్తశుద్ధితో ఉంటారని గుర్తింపు పొందారు. గతంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో.. శ్యామలరావు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకోవడంతోపాటు, రాష్ట్రానికి ఆదాయం పెరిగేలా పని చేశారు.. అప్పుడు ఆక్ష్నకు గుర్తింపు దక్కింది. అలాంటి చిత్తశుద్ధి ఉన్న అధికారి తిరుమలలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయన్ను ఈవోగా నియమించిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుత టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి సెలవులో ఉన్నారు.. ఆయన్ను కేవలం అడిషనల్ ఈవో స్థాయికి పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో.. తొలిసారిగా ధర్మారెడ్డి డిప్యుటేషన్‌పై టీటీడీలోకి వచ్చారు. ధర్మారెడ్డి టీటీడీ ప్రత్యేకాధికారిగా పనిచేశారు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీటీటీ ఈవో (ఎఫ్‌ఏసీ) నుంచి ఆయన్ను ప్రభుత్వం తప్పించింది. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ధర్మారెడ్డి కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్‌పై మళ్లీ టీటీడీలోకి వచ్చారు. ఆయన్ను టీటీడీ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆ తర్వాత అడిషనల్ ఈవోగా బాధ్యతలు అప్పగించారు.. ఆ తర్వాత టీటీడీ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డి సీఎస్‌గా వెళ్లడంతో సీన్ మారింది. ధర్మారెడ్డిని ఈవో (పూర్తి అదనపు బాధ్యతలు) అప్పగించారు. ఆ తర్వాత రెగ్యులర్ ఈవోను నియమించకుండా.. ఈయనే ఈవోగా కొనసాగారు.
2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ధర్మారెడ్డి వారం రోజులు సెలవుపై వెళ్లారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులతో తిరమలకు వెళ్లారు.. అక్కడ తిరుమల నుంచి ప్రక్షాళన మొదలు పెడతామని ప్రకటించారు. చెప్పినట్లుగానే టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు. శ్యామలరావు ఒకటి, రెండు రోజుల్లో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.