తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన.. సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం.. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు పొందిన భక్తులు.. జూన్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు పొందుతారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను.. టీటీడీ జూన్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.. అలాగే జూన్ 21 మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవలు ( కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార), వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. తిరుమల శ్రీవారిని వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు దర్శించుకునేందుకు వీలుగా.. సెప్టెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది.
టీటీడీ సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. అలాగే తిరుమల, తిరుపతిలలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. అలాగే జూన్ 25న టీటీడీ స్థానిక ఆలయాల్లో శ్రీవారి సేవ కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ పోస్టర్లను జేఈవో వీరబ్రహ్మం శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 16న అంకురార్పణ, జూన్ 17న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు జేఈవో. జూన్ 21న గరుడసేవ, జూన్ 22న హనుమంత వాహనం, జూన్ 24న రథోత్సవం, జూన్ 25న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.
తిరుమలలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 14 మంది భక్తులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డి, హెడ్ నర్స్ శ్రీమతి సావిత్రి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.