దేశంలో ఉన్న వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024 లో అక్రమాలు జరిగాయంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెల్లడి అవుతున్నాయి. నీట్ పేపర్‌ను లీక్ చేసేందుకు.. అభ్యర్థుల నుంచి ఏకంగా రూ.30 లక్షల చొప్పున నిందితులు తీసుకున్నట్లు తాజాగా తెలిసింది. బీహార్‌లో చేపట్టిన దర్యాప్తులో ఈ సంచలన విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. అయితే బీహార్‌లో ఈ నీట్ ప్రశ్నా పత్రం లీక్ అయినట్లు వార్తలు రాగా.. నీట్ ఆశావహులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం.. నీట్ పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగలేదంటూ పేర్కొంటున్నాయి.
నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు తాజాగా బీహార్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. నీట్ పేపర్‌ను లీక్ చేసినందుకు కొందరు అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున చెల్లించినట్లు.. విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారంతో పలు నేషనల్ మీడియాల్లో విస్తృత వార్తలు వెలువడ్డాయి. ఇక నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఇప్పటికే బీహార్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-సిట్‌ను ఏర్పాటు చేసింది.
నీట్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఈ కేసులో ఇప్పటివరకు 14 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజినీర్ కూడా ఉండటం గమనార్హం. ఇప్పుడు ఈ జూనియర్ ఇంజినీర్‌ను విచారణ జరపగా.. కేసు కూపీ మొత్తం బయటికి వచ్చినట్లు సమాచారం. పేపర్ లీక్ గ్యాంగ్‌తో కలిసి తాను అవకతవకలకు పాల్పడినట్లు సిట్ విచారణలో ఆ జూనియర్ ఇంజినీర్ అంగీకరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. నీట్ రాసిన విద్యార్థుల తల్లిదండ్రులతో తాను టచ్‌లో ఉన్నట్లు ఆ జూనియర్ ఇంజినీర్ సిట్‌కు చెప్పినట్లు సమాచారం.
‘మే 4 వ తేదీన ఆ పేపర్ లీకేజీ గ్యాంగ్‌లో ఉన్న తమకు నీట్ ప్రశ్నపత్రం లభించిందని.. ఆ నీట్ ప్రశ్నాపత్రం కోసం కొంతమంది అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి తమ గ్యాంగ్ రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు వసూలు చేసినట్లు ఆ జూనియర్ ఇంజినీర్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత డబ్బులు ఇచ్చినవారిని సేఫ్‌హౌస్‌కు తీసుకెళ్లి నీట్ ప్రశ్నపత్రాన్ని చూపించినట్లు.. అరెస్ట్ అయిన మరో ఇద్దరు నిందితులు విచారణలో అంగీకరించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
మొత్తం 13 మంది నీట్ అభ్యర్థులు ఈ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీలో ఉన్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో నలుగురు విద్యార్థులను ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో 9 మందికి తాజాగా నోటీసులు కూడా జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో సూచించారు. అయితే పేపర్ లీక్ కాలేదంటూ ఇప్పటివరకు వాదించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. పేపర్ లీకేజీకి రూ.30 లక్షలు ఇచ్చారని వస్తున్న తాజా ఆరోపణలపై ఇంకా స్పందించలేదు.