గత కొన్ని నెలలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం గానీ.. రాష్ట్ర ప్రభుత్వాలు గానీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే సాహసం చేయలేదు. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు ముగియడంతో పెట్రో వడ్డన ప్రారంభం అయింది. అయితే ఈసారి పెంపు భారీగా ఉండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.3 పెంచి ప్రభుత్వం.. వాహనదారుల నడ్డి విరుస్తోంది. ఇక ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.
దేశంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ పెట్రో వడ్డన మొదలెట్టింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.3 వడ్డించింది. ఈ మేరకు కర్ణాటకలో పెట్రోల్, డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్ పెంచినట్లు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. తక్షణమే ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్‌లో సిద్ధరామయ్య సర్కార్ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా పెట్రో రేట్లను సవరించినట్లు అఖిల కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ వెల్లడించింది.
పెట్రోల్‌పై ఇప్పటివరకు ఉన్న 25.92 శాతం సేల్స్ ట్యాక్స్‌ను.. 29.84 శాతానికి పెంచినట్లు అఖిల కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తెలిపింది. అదేవిధంగా డీజిల్‌పై 14.3 శాతం ఉన్న సేల్స్ ట్యాక్స్‌ను 18.4 శాతానికి పెంచినట్లు పేర్కొంది. ఇక ధరలు సవరించి సేల్స్ ట్యాక్స్ పెంచిన తర్వాత కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.85 కు.. లీటర్ డీజిల్ ధర రూ.88.93 కు పెరిగింది. అంతకుముందు లీటర్ పెట్రోల్ ధర రూ.99.84.. లీటర్ డీజిల్ ధర రూ.85.93 గా ఉండేది.