దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని భారతమాతగా అభివర్ణిస్తూ కేంద్రమంత్రి సురేష్ గోపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఇందిరా గాంధీని భారతమాతతో పోల్చిన సురేష్ గోపీ.. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కే కరుణాకరన్‌ను తన రాజకీయ గురువు అని పేర్కొన్నారు. అంతేకాకుండా మార్క్సిస్ట్ సీనియర్ నేత ఈకే నాయనార్ కూడా తన రాజకీయ గురువు అని వెల్లడించారు. బుధవారం పున్‌కున్నంలోని కేరళ మాజీ సీఎం కరుణాకరన్ స్మారకం అయిన మురళీ మందిరాన్ని సందర్శించిన సురేష్ గోపీ.. మీడియా ముందు ఈ వ్యాఖ్యలు చేశారు.
కరుణాకరన్ స్మారకం సందర్శనకు వచ్చిన తనకు ఎలాంటి రాజకీయాలు జోడించవద్దని మీడియాకు కేంద్రమంత్రి సురేష్ గోపీ విజ్ఞప్తి చేశారు. తన గురువుకు నివాళి అర్పించేందుకే మాత్రమే తాను అక్కడికి వచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని.. తాను భారతమాత లాగా భావిస్తానని సురేష్ గోపీ వెల్లడించారు. ఇక కరుణాకరన్‌ను కేరళ కాంగ్రెస్ పార్టీ తండ్రిగా సురేష్ గోపీ అభివర్ణించారు. కరుణాకరన్ ధైర్యవంతమైన పాలకుడని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగి విజయం సాధించిన సురేష్ గోపీ.. బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. ఆయనపై బరిలో నిలిచిన మాజీ సీఎం కరుణాకరన్ కుమారుడు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కే మురళీధరన్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
మరోవైపు.. మార్క్సిస్ట్ సీనియర్ నేత ఈకే నాయనార్, ఆయన భార్య శారద టీచర్ మాదిరిగా కరుణాకరన్, ఆయన భార్య కల్యాణికుట్టి అమ్మతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సురేష్ గోపీ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నికల ఫలితాల్లో గెలిచి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 12 వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి కన్నూర్‌లోని నాయనార్ ఇంటికి కూడా సురేష్ గోపీ వెళ్లారు.
ఇక 2019 లోనే కరుణాకరన్ స్మారకం మురళీ మందిరాన్ని సందర్శించాలని తాను భావించినప్పటికీ.. ఇటీవల బీజేపీలో నుంచి వెళ్లిన సీనియర్ నేత కుమార్తె పద్మజ వేణుగోపాల్ తనను నిరుత్సాహపరిచారని సురేష్ గోపీ పేర్కొన్నారు. తర్వాత ప్రముఖ లూర్ద్ మాతా చర్చిని సందర్శించి సురేష్ గోపీ ప్రార్థనలు చేశారు. తన కుమార్తె వివాహం సందర్భంగా సెయింట్ మేరీ విగ్రహానికి బంగారు కిరీటాన్ని సురేష్ గోపీ సమర్పించడంపై రాజకీయ ప్రత్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ కిరీటాన్ని పసుపు లోహంతో, రాగితో తయారు చేశారని ఆరోపించారు.