మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు రౌడీషీట్ తెరిచినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపైనా పోలీసులు రౌడీ షీట్ తెరిచారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల సంఘం పల్నాడు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
పోలింగ్ రోజున రెంటచింతల మండలంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో ఆయన్ను అడ్డుకోబోయిన టీడీపీ కార్యకర్త శేషగిరిరావుపై పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. పోలింగ్ ముగిసిన మాచర్ల నియోజకవర్గం పరిధిలో కారంపూడిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరగడంతో పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులపై రౌడీ షీట్ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
పిన్నెల్లికి ముందస్తు బెయిల్ వస్తుందా..?
పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టిన వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. ఓట్ల లెక్కింపు రోజున మాచర్ల నియోజకవర్గానికి పిన్నెల్లి వెళ్లేందుకు సుప్రీం అనుమతి ఇవ్వలేదు. కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు వెళ్లొద్దని వైసీపీ నేతకు న్యాయస్థానం స్పష్టంగా తెలిపింది. ఈవీఎం ధ్వంసంతోపాటు మరో నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో పిన్నెల్లికి జూన్ 20వ తేదీ వరకు రక్షణ కల్పించిన న్యాయస్థానం.. ముందస్తు బెయిల్ పిటీషన్ల విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.
20 ఏళ్లపాటు పిన్నెల్లి ఫ్యామిలీ హవా..
2004 నుంచి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి కుటుంబీకుల హవా నడుస్తోంది. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో లక్ష్మారెడ్డి వారసుడిగా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2012 ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన రామకృష్ణారెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. నియోజకవర్గంలో పాతుకుపోయారు. అయితే 2024 ఎన్నికల్లో మాచర్ల నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపిన టీడీపీ ఆయనకు చెక్ పెట్టింది. 33 వేల ఓట్లకుపైగా మెజార్టీతో పిన్నెల్లిపై జూలకంటి విజయం సాధించారు.
గతంలో పల్నాడు పోలీసులపై లోకేశ్ ఆగ్రహం..
పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 29న ట్వీట్ చేశారు. నియోజకవర్గంలోని కొందరు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రైవేటు సైన్యంలా మారిపోయారని ఆయన ఆరోపించారు. బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారంటూ పోలీసుల తీరుపై లోకేశ్ మండిపడ్డారు. వెల్దుర్తిలో టీడీపీ సానుభూతిపరులైన మత్స్యకారులు వైసీపీలో చేరాలని లేదంటే రూ.2 లక్షలు కప్పం కట్టాలని ఎస్ఐ శ్రీహరి వేధించడంతో దుర్గారావు అనే మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకున్నాడని లోకేశ్ తెలిపారు. ఇది పోలీసు శాఖకే మాయని మచ్చ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై శ్రీహరి లాంటి పోలీసులు త్వరలో ఏర్పాటు కాబోయే మా ప్రజా ప్రభుత్వంలో కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
![]() |
![]() |