కలియుగ ప్రత్యక్షత్ర దైవం ఏడు కొండలపై కొలువైన తిరుమల శ్రీవారికి నేడు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం జరుగనుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వామివారికి నిర్వహించే సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ గత 18 ఏళ్లుగా నిర్వహిస్తోంది. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు.
ఏడాదికి ఒక్కసారి నిర్వహించే ఈ సహస్ర కలశాభిషాకానికి ప్రత్యేకత ఉంది. సహస్ర కలశాభిషేకం అంటే 1008 పాత్రలు అభిషేక తీర్థంతో నిండి ఉంటాయి. పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించినట్లు చరిత్ర చెబుతోంది. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. పల్లవరాణి కానుకకు సంబంధించిన ఈ శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వెంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన సాక్షాత్కరిస్తుంది.
కొనసాగుతున్న భక్తుల రద్దీ..ఇదిలా ఉండగా.. తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి వెలుపల కూడా కి.మీ మేర భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శనివారం (జూన్ 15) తిరుమల శ్రీవారిని 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక ఇవాళ టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించనున్నారు.