ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. 2014-19 మధ్య కాలంలో ఆయన ఇదే శాఖకు మంత్రిగా పని చేయగా.. అప్పుడున్న ఛాంబర్‌లోనే తాజాగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు వేదాశ్వీరచనం ఇచ్చారు. పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీ లక్ష్మీ మంత్రి నారాయణకు స్వాగతం పలికారు. ఇక బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి నారాయణ రాజధాని అమరావతిపై కీలక కామెంట్స్ చేశారు.
పాత మాస్టర్ ఫ్లాన్ ప్రకారమే అమరావతి నిర్మిస్తామని చెప్పారు. అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. ప్రపంచంలోనే టాప్-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిలపటమే చంద్రబాబు కల అని అందుకు తన వంతుగా శ్రమిస్తానని వెల్లడించారు. అమరావతిలో అనేక భవనాల నిర్మాణం వివిధ దశల్లో నిలిచిపోయిందని చెప్పారు. పక్కా ప్రణాళికతో రెండున్నర సంవత్సరాల్లోనే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అందుకు మూడు ఫేజుల్లో లక్ష కోట్లు అవసరమవుతాయని చెప్పారు.
అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగులు, అధికారుల ఇళ్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. 3,600 కి.మీ మేర రహదారులు నిర్మించి మౌళిక వసతులు కల్పిస్తామన్నారు. రాజధాని రోడ్లు ధ్వంసం, దొంగతనాలపై చర్యలు తీసుకుంటామన్నారు. రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల అభివృద్ధి సమానంగా జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు.