ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతికి మళ్లీ మంచి రోజులుస్తున్నాయి. ఐదేళ్లపాటు అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన అమరావతి పనుల్లో కదలిక కనిపిస్తోంది. మూడు రాజధానుల పేరిట గత సర్కారు రాజధాని నిర్మాణం విషయంలో తాత్సారం చేయగా.. చంద్రబాబు నాయుడు సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే.. రాజధాని అమరావతి మాత్రమేనంటూ స్పష్టమైన ప్రకటన చేశారు.
2014లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణకే మరోసారి ఆ శాఖ బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో రాజధాని అమరావతికి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించిన నారాయణ.. మరోసారి ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు, జేఏసీ నేతలు ఆయన్ను అభినందించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. గతంలో ఖరారు చేసిన మాస్టార్ ప్లాన్ ప్రకారమే అమరావతి నగర నిర్మాణం ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో దేశ విదేశాలు తిరిగి అమరాతి నిర్మాణ నమూనాను రూపొందించామన్న నారాయణ.. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలను ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేసిందన్న నారాయణ.. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. అమరావతితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అభివృద్ధిపై దృష్టిసారిస్తామని మంత్రి తెలిపారు.
రాజధాని నిర్మాణాన్ని మూడు దశల్లో పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మొదటి దశ నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేస్తామన్న నారాయణ.. అమరావతిలో ముందుగా 3600 కి.మీ. రోడ్లతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తొలి విడత నిర్మాణం కోసం రూ.48 వేల కోట్లు అవసరమన్న నారాయణ.. గతంలో రూ.10 వేల కోట్ల వరకు చెల్లింపులు చేశామన్నారు. మొత్తంగా రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయల దాకా అవసరమని అంచనా వేశామన్నారు.
2014లో నవ్యాంధ్రకు తొలి సీఎంగా ఎన్నికైన చంద్రబాబు రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించారు. పూర్తిగా కొత్త నగరాన్ని నిర్మించేందుకు ఆయన మొగ్గు చూపారు. సచివాలయం, హైకోర్టు తదితర భవనాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. అయితే 2019 ఎన్నికల్లో బాబు ఓడిపోవడంతో అమరావతి పనులకు బ్రేకులు పడ్డాయి. జగన్ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి పనులు ఆగిపోయాయి. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం సాధించడంతో మళ్లీ అమరావతి అంశం తెర మీదకు వచ్చింది. ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగడం మొదలైంది. ఇప్పుడు మంత్రి ప్రకటనతో అమరావతి, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు ఊపు వస్తుందని చెప్పొచ్చు.
![]() |
![]() |