ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విదేశాల బాటపడుతున్న భారత కోటీశ్వరులు.. ఎక్కువగా వెళ్తోంది ఆ దేశానికే!

national |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 08:32 PM

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. నానాటికీ భారత్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. అయితే ఇంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. దేశంలోని చాలా మంది కోటీశ్వరులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు.. సొంత దేశాన్ని వదిలేసి.. ఇతర దేశాలకు మకాం మార్చుతున్నారు. ఏ దేశంలోనైనా.. కొంత డబ్బు సంపాదించిన తర్వాత.. ఉన్న దేశాన్ని వదిలిపెట్టి.. వేరే దేశానికి వెళ్లి వ్యాపారాలు విస్తరించే వారు ఉంటారు. ఇలాంటి వారిపైనే అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ అనే సంస్థ తాజాగా ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఈ 2024 సంవత్సరంలో సుమారు 4300 మంది కోటీశ్వరులు భారతదేశాన్ని విడిచిపెడతారని అంచనా వేసింది. అయితే గత ఏడాది ఇదే 5100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చినట్లు ఈ నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో ఈ 2024 లో ప్రపంచ దేశాలకు చెందిన 1.28 లక్షల మంది తాము ఉన్న దేశాన్ని వదిలి ఇతర దేశాలకు వెళ్తారని అంచనా వేసింది.


ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్.. మిలియనీర్లు వలసల పరంగా చైనా, బ్రిటన్ తర్వాతి స్థానంలో మూడో ప్లేస్‌లో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాను ఇటీవలె భారత్ అధిగమించి.. తొలి స్థానంలోకి వచ్చింది. ఇక ప్రతి సంవత్సరం వేలాది మంది భారత మిలియనీర్లు.. విదేశాలకు వెళ్తున్నారు. ఇక వీరిలో చాలా మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - యూఏఈ దేశానికి వలసవెళ్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో.. దేశాన్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్లిన మిలియనీర్ల కంటే.. దేశంలో కొత్త మిలియనీర్లలను తయారు చేస్తూనే ఉందని ఆ నివేదిక తెలిపింది.


భారత్‌ నుంచి వెళ్లిపోయే చాలా మంది మిలియనీర్లు.. స్వదేశంలో వ్యాపార ప్రయోజనాలతోపాటు ఇళ్లను కూడా కలిగి ఉన్నారని ఆ రిపోర్ట్‌ హైలైట్ చేసింది. ఇది భారత్‌తో కొనసాగుతున్న ఆర్థిక సంబంధాలను సూచిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ప్రైవేట్ బ్యాంకులు, వెల్త్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లు తమ క్లైయింట్‌లకు సలహాలు, సేవలు అందించేందుకు యూఏఈలో చురుకుగా విస్తరిస్తున్నాయి. ఇటీవల నువామా ప్రైవేట్, ఎల్‌జీటీ వెల్త్ మేనేజ్‌మెంట్ అనే సంస్థలు గ్లోబల్ డైవర్సిఫికేషన్, విస్తరణ అవసరాలతో భారత మిలియనీర్లకు మద్దతు ఇస్తున్నాయి. అదేవిధంగా ఇతర బ్యాంకులు కూడా ఆ దేశంలో తమ ఉనికిని పెంచుకుంటున్నాయి.


ఇక 2024 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.28 లక్షల మంది మిలియనీర్లు.. స్వదేశం నుంచి విదేశాలకు వెళ్తారని.. హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ అనే సంస్థ తెలిపింది. వీరంతా యూఏఈ, అమెరికా దేశాలను తమ గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ దేశానికి వచ్చిన మిలియనీర్లు, వారితోపాటు ఆస్తులను భారీగా తరలించడం వల్ల విదేశీ మారక నిల్వలు పెరుగుతున్నాయి. వారు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల స్థానిక స్టాక్ మార్కెట్లను కూడా ఉత్తేజపరుస్తాయి. ఇక ఇలాంటి మిలియనీర్లు స్థాపించిన వ్యాపారాలు అనేక ఉద్యోగాలు సృష్టించి.. ఉద్యోగులకు జీతాలను సృష్టిస్తాయని పేర్కొంది. ఇవి మధ్యతరగతికి ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపింది. మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా వంటి సంస్థలు అమెరికాలో ఈ ప్రభావాన్ని చూపాయి.


ఇక మిలియనీర్ అంటే రూ.8 కోట్ల కంటే ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టే వారిగా పేర్కొన్నారు. అయితే ఈ వలసలకు చాలా కారణాలు ఉన్నాయి. భద్రత, ఆర్థిక ప్రమాణా, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మొత్తం జీవన ప్రమాణాలతో సహా వివిధ కారణాల వల్ల మిలియనీర్ కుటుంబాలు ఉన్న దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తూ ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa