ఎన్నికల సమయంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో సవాలు చేస్తుంటారు. పేరు మార్చుకుంటానని కొందరు, ముక్కు నేలకు రాస్తానని మరికొందరు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని మరికొందరు.. క్షమాపణలు చెప్తానంటూ ఇలా ఎన్నో రకాల సవాలు రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటారు. ఎవరైనా సవాలు గురించి అడిగితే.. నేను చేసిన మాట వాస్తవమే.. నా సవాలుకు ప్రత్యర్థులు స్పందిచలేదంటూ మాట మారుస్తారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఛాలెంజ్‌లు ఎన్నో చూశాం. అందులో ఒకటి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పేరు మార్పు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాలు విసిరారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. దీంతో ముద్రగడ పేరు ఎప్పుడు మార్చుకుంటున్నారంటూ నెటిజన్లె ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై అయన స్పందిస్తూ... తాను చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించి.. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇక నుంచి అధికారికంగా ముద్రగడ పద్మనాభం పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారింది.