రాష్ట్రంలోని ప్రతి రైతుకు చేయూతనందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శిరివెళ్ల మండలంలోని యర్రగుంట్ల గ్రామంలో అమ్మవారిశాలలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం నుంచి రాయితీపై వచ్చిన జీలుగ విత్తనాలను ఆమె రైతులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది మండలంలోని రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకున్న 1,685 మంది రైతులకు 570 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను అందజేస్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు, విత్తనాలు కరువయ్యాయని అన్నారు. అమ్మవారిశాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే అఖిలప్రియకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వాసవీమాతకు అఖిలప్రియ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఆళ్లగడ్డ ఇన్ చార్జి ఏడీఏ నాగేంద్ర ప్రసాద్, శిరివెళ్ల ఏవో సుధాకర్, మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, పుల్లారెడ్డి, లక్ష్మీరెడ్డి, జయరామిరెడ్డి, నాగేశ్వరరావు, లక్ష్మీప్రసాద్, నాగిరెడ్డి, రామ్మోహన్, బాలగుర్రెడ్డి, యామా గుర్రప్ప, సూరారామ, మోహన్‌రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.