వర్షాకాల సన్నద్ధతపై టీటీడీ ఈవో శ్యామలరావు గురువారం గోకులం విశ్రాంతి భవనంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు.వివిధ సందర్భాల్లో భారీ వర్షాలకు బండరాళ్లు కూలి దెబ్బతిన్న రెండో ఘాట్‌రోడ్డును ఎలా పునరుద్ధరించారో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కల్యాణి డ్యాంతో పాటు తిరుమలలో భక్తులకు ప్రధాన నీటి వనరులైన ఐదు డ్యాముల గురించి కూడా వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ రూపొందించాలని ఈవో ఆదేశించారు. కొనుగోళ్లు, గిడ్డంగుల శాఖలపై సమీక్షించారు. జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సీఈ నాగేశ్వరరావ, ఎస్‌ఈ2 జగదీశ్వర్‌రెడ్డి, ఈఈలు సురేంద్రనాథ్‌రెడ్డి, శ్రీహరి, ఎలక్ర్టికల్ డీఈ రవిశంకర్‌రెడ్డి, కొనుగోళ్ల జీఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.కాగా ఈవో గురువారం నారాయణగిరి షెడ్ల వద్ద వివిధ క్యూలైన్లను పరిశీలించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు వెళ్లే సర్వదర్శన, స్లాటెడ్ సర్వదర్శన, ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్లను తనిఖీ చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఈవోకు పారిశుధ్య లోపం స్పష్టంగా కనిపించింది. క్యూలైన్లలోనే వ్యర్థాలు కనిపించడంతో ఆయన సీరియస్ అయ్యారు.సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు.