విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ అలవరుచుకోవాలని, ఉత్తమ విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు అన్నారు. కోరుకొండ మండలంలోని గాడాల జడ్పీ హైస్కూల్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్ధి దశలో 25 సంవత్సరాలు పాటు కష్టపడి చదివితే మిగిలిన జీవితం అంతా హాయిగా ఉంటుందన్నారు. ఇంగ్లీషు, హిందీ పాఠాలు చదివించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించబోమని, ప్రతిఒక్కరు నిబంధనలతో పని చేయాలన్నారు. అనంతరం ఆయన గ్రామంలోని మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం.సురేష్‌కుమార్‌ను పాఠశాలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అడ్మిషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. యుడైస్‌లో ప్రోగ్రసీవ్ మాడ్యూల్‌ను పూర్తి చేశారా అని ప్రశ్నించారు. రికార్డులను పరిశీలించారు. ఒకటి, రెండు తరగతులు ఉపాధ్యాయులు 90 రోజుల విద్య ప్రణాళికను, కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. డీఈవో వెంట సమగ్ర శిక్ష సీఎంవో శ్రీనివాసరావు, హై స్కూల్ హెచ్‌ఎం జ్యోతికుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.