2047 విజన్ డాక్యుమెంటుకు అనుగుణంగా పని చేద్దామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుదామని తెలిపారు. ప్రతిభ ఉన్న వారిని తగిన విధంగా ముందుకు తీసుకెళ్దామని ఉద్ఘాటించారు. డిప్యూటీ సీఎంగా తన శాఖలపై వరుస సమీక్షల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గురువారం ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఇన్నోవేషన్‌కు అనుగుణంగా పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చే దిద్దాలని కోరారు. పిల్లలకు శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి కల్పించడంపై ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో చాలా ప్రతిభ ఉంటుందని వివరించారు. ఈ విషయాలను వెలికితీసేలా భారీ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. పిల్లలను పూర్తి స్థాయిలో నైపుణ్యవంతులుగా తయారు చేయాలని.. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరం అయిన ప్రోత్సాహం అందించాలని ఆదేశించారు. గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వైజ్ఞానిక ప్రదర్శనలు పూర్తి స్థాయిలో జరగాలన్నారు. ఇందువల్ల రాబోయే తరాల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని చెప్పారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం త్వరలోనే ప్రారంభించాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.