మొదటిసారిగా ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తొలిరోజే అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం పూర్తైన తర్వాత పవన్ కళ్యాణ్ సీజనల్ వ్యాధుల మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల గురించి పవన్ కళ్యాణ్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వంలో మళ్లించడంపైనా ప్రశ్నించారు. అలాగే స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు ఎందుకు జరగలేదని వారిని నిలదీశారు. ఆర్థిక సంఘం, స్థానిక సంస్థల నిధులను ఏ మేరకు ఇతరత్రా వాటికి మళ్లించారో నివేదించాలని అధికారులకు స్పష్టం చేశారు.
అలాగే సీఎఫ్ఎంఎస్ అకౌంట్‌కు ఎన్ని నిధులు మళ్లించారనే దానిపైనా వివరాలు కోరారు. విజయవాడలో కలుషిత తాగునీటి సరఫరా అంశంపైనా పవన్ స్పందించారు. తాగునీటి సరఫరాలో తలెత్తిన లోపాలే డయేరియాకు కారణమయ్యాయన్నారు. ఇక వేసవి కాలం నుంచి వర్షాకాలానికి మారుతున్న తరుణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు డయేరియా నియంత్రణపై అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్.. ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
మరోవైపు డయేరియా విషయంలో నిర్లక్ష్యం వద్దని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు. జగ్గయ్యపేట ప్రాంతంలో డయేరియా కేసులు నమోదు కావటంపై మంత్రి ఆరా తీశారు. ఫోన్ ద్వారా ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఆదేశాలతో.. జిల్లా ఆరోగ్యశాఖ అధికారి, వైద్యాధికారులు ఆయా ప్రాంతాలను గురువారం రాత్రి సందర్శించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు విరోచనాలతో బాధపడుతూ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కూడా డయేరియా ప్రబలిన ప్రాంతాల్ని గురువారం రాత్రి సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ఆదేశించారు.