కాపు ఉద్యమ నేత, వైసీపీ లీడర్ ముద్రగడ పద్మనాభం (ముద్రగడ పద్మనాభరెడ్డి) తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచిన ముద్రగడ.. ఇప్పుడు తన పేరును మార్చుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేసిన ముద్రగడ పద్మనాభం.. జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడంతో ఇచ్చిన మాట ప్రకారం ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఈ గెజిట్ పత్రాలను పవన్ కళ్యాణ్‌కు పంపిన ముద్రగడ.. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు.
నేను అసమర్థుడిని.. పవన్ కళ్యాణ్ దమ్మన్న నాయకుడు అంటూ ముద్రగడ భావోద్వేగానికి గురయ్యారు. తన పేరును మార్చుకోవాలంటూ కాపు, బలిజ యువత నుంచి ఎంతో ఒత్తిడి వచ్చిందని.. విలేకర్ల సమావేశంలో ఎమోషనల్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను స్వలాభం కోసమే ఉద్యమం చేశానని జనసేన నేతలు, పవన్ కళ్యాణ్ పదే పదే ఆరోపించారన్న ముద్రగడ పద్మనాభం.. అమ్ముడుపోయానని ఆరోపించారని గుర్తుచేసుకున్నారు. తాను అసమర్థుడిని, చేతకానివాడిని అయినందునే కాపు రిజర్పేషన్ల ఉద్యమాన్ని కొనసాగించలేకపోయానని అన్నారు. పవన్ కళ్యాణ్ దమ్మున్న, ధైర్యమున్న లీడర్ అని చెప్పిన ముద్రగడ.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా ఉన్నారన్నారు. కాపుల చిరకాల కోరిక తీర్చే అవకాశం ఉన్న దమ్ము, ధైర్యం ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నట్లు చెప్పారు.
కాపుల రిజర్వేషన్లతో పాటుగా ప్రత్యేక హోదాపైనా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కూడా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలని ముద్రగడ పద్మనాభం కోరారు. ఇక సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తనపై అసభ్య పదజాలంతో బూతులు పోస్టులు పెడుతున్నారని ముద్రగడ ఆరోపించారు. ఇది మంచిపద్ధతి కాదన్న ముద్రగడ పద్మనాభం.. అంతకంటే మనుషులను పంపించి మమ్మల్ని చంపేయించండి అంటూ ఎమోషనల్ అయ్యారు. తాము అడ్డపడలేమని, అనాథలమని.. బూతులు పోస్టులు పెట్టించడం ఆపివేయాలని ముద్రగడ పద్మనాభం కోరారు.