కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే.. మరికొందరు సొంత వాహనాల్లో తిరుమల చేరుకుని వేంకటేశ్వరుడి దర్శించుకుని తరిస్తూ ఉంటారు. అలాగే స్వామి వారి హుండీలో తమకు తోచిన, తమకు చేతనైతే కానుకలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఇలా భక్తులు సమర్పించిన వాచీలు, ఫోన్లను టీటీడీ వేలం వేస్తూ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని ఈ కానుకలను సొంతం చేసుకునే వీలుంది.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటుగా ఇతర అనుబంధ ఆలయాలలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా వచ్చిన వాచీలు, మొబైల్ ఫోన్లను తిరుమల తిరుపతి దేవస్థానం వేలం వేస్తోంది. జూన్ 24వ తేదీ ఏపీ ప్రభుత్వం కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం ప్రక్రియ జరగనుంది. వేలంలో కొత్తవి, లేదా ఉపయోగించిన వాచీలు 14 లాట్లు, సెల్ ఫోన్లు 24 లాట్లను ఉంచారు. ఆసక్తికలిగిన వారు ఈ- వేలంలో పాల్గొని వీటిని సొంతం చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. టైటాన్, క్యాషియే, ఆల్విన్, టైమెక్స్, సోనాటా, ఫాస్ట్ ట్రాక్ కంపెనీలకు చెందిన వాచీలతో పాటుగా.. నోకియా, శామ్ సంగ్, వివో, మోటరోలా వంటి బ్రాండ్లకు చెందిన సెల్ ఫోన్లు కూడా ఉన్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
జూన్ 22న పౌర్ణమి గరుడసేవ
మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడసేవ ఉత్సవం ఈ నెల 22న ( శనివారం) జరగనుంది. ప్రతి నెలా పౌర్ణమిని పురస్కరించుకుని ఈ గరుడసేవ నిర్వహిస్తూ ఉంటారు. పౌర్ణమి గరుడసేవలో భాగంగా శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాఢవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు.