ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పురందేశ్వరి మూడు రిక్వెస్ట్‌లు చేశారు. ఇసుక, మద్యంతో పాటూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం విక్రయాలతో పాటుగా.. ఎక్సైజ్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌లో అవినీతిపై విచారణ చేయించాలని కోరారు. అలాగే గత ఐదేళ్లలో జరిగిన ఇసుక దోపిడీపైనా రాష్ట్రప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని పురందేశ్వరి కోరారు. సీఎం చంద్రబాబుకు వినతిపత్రాలను అందజేశారు. ఈ అంశాలను పరిశీలించాలని కోరారు.
గత ఐదేళ్లలో నాణ్యత లేని మద్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు పురందేశ్వరి. రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం ఏకంగా రూ.33వేల కోట్ల మద్యం అమ్మకాలు చూపిస్తున్నారన్నారు. అలాగే మద్యం కొనుగోలు, అమ్మకంలో తేడా 400% నుంచి 500% శాతం వరకు ఉందని.. ఇదంతా వైఎస్సార్‌సీపీ నేతల జేబుల్లోకి చేరిందని ఆరోపించారు. మద్య నియంత్రణ, క్వాలిటీ లిక్కర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు ఇప్పటి వరకూ ఉన్న డిస్టిలరీస్‌పై విచారణ జరిపించాలి అన్నారు. మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులను పూర్తిస్ధాయిలో అమలు పరచాలని కోరారు. అలాగే మద్యానికి బానిసైన వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు రిహేబిలిటేషన్ సెంటర్లను రాష్ట్రం అంతా ప్రారంభించాలని కోరారు.
అంతేకాదు వైఎస్సార్‌సీపీ హయాంలో ఇసుక దోపిడీ కారణంగా భవన నిర్మాణ కార్మికుల జీవితాలు దెబ్బతిన్నాయన్నారు పురందేశ్వరి. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు పాటించకుండా ఇసుక తవ్వేశారని ఆరోపించారు. నదీగర్భంలో రోడ్డు వేసి మరీ ఇసుకను తరలించారని.. ఇసుక తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది అన్నారు. ఇసుకలో వైఎస్సార్‌సీపీ నేతలు భారీ ఎత్తున దోచుకున్నారని ఆరోపించారు.. కొత్త ఇసుక విధానంలో భాగంగా ఆన్‌లైన్ బిల్లింగ్ అమలుచేయాలని కోరారు. ఎన్జీటీ నిబంధనల మేరకు తవ్వకాలు చేయాలని.. గత ఐదేళ్ల పాలనలో ఇసుక తవ్వకాలపై విచారణ చేయించాలని కోరారు.
అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విందు ఇచ్చారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో పాటుగా ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్‌లు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్‌రావు, ఆదినారాయణరెడ్డి, పార్థసారథి, ఎన్.ఈశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను చంద్రబాబు శాలువాలతో సత్కరించారు.
మరోవైపు రాష్ట్రంలో పరిస్థితులు, ఎన్నికలు జరిగిన తీరు, మూడు పార్టీలు సమష్టిగా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలని నిర్ణయించారు నేతలు. చంద్రబాబు పలు కీలక అంశాలపై బీజేపీ నేతలతో చర్చించారు.. అలాగే రాష్ట్ర పాలనలో సమన్వయం కోసం మూడు పార్టీల నేతలతో నియోజకవర్గ, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు వేయాలని కోరారు. రాజధాని అమరావతిలో బీజేపీ కార్యాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని బీజేపీ నేతలు కోరారు. అలాగే నరేగా నిధులతో అనపర్తి నియోజకవర్గంలో కాకినాడ కెనాల్‌ను బాగు చేయించిన విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో జరిగిన దాడుల్ని సుజనాచౌదరి ప్రస్తావించగా.. మూడు పార్టీలవారూ ఇబ్బంది పడ్డామన్నారు సీఎం జగన్.