కృష్ణ తేజ ఐఏఎస్.. ఇప్పుడు తెలుగు నాట బాగా వినిపిస్తోన్న పేరు. కేరళ కేడర్‌కు చెందిన ఈ తెలుగు అధికారి పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా డిప్యూటేషన్‌పై ఏపీకి రానున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరికోరి మరీ ఆయన్ను ఓఎస్డీగా తెప్పించుకుంటున్నారు. దీంతో ఆయన గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు.
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటకు చెందిన కృష్ణ తేజ మైలవరపు 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఏఎస్ కావాలనే పట్టుదలతో నాలుగుసార్లు సివిల్స్ రాసిన ఆయన చివరకు 66వ ర్యాంక్ సాధించారు. కేరళ కేడర్‌కు చెందిన ఆయనకు డేరింగ్ అండ్ డ్యాషింగ్ అధికారిగా పేరుంది. ప్రస్తుతం తిసూర్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయన ఇంతకు ముందు కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా వ్యవహరించారు.
అలప్పుజ జిల్లాలోని పనవల్లి ఐల్యాండ్‌లో కోస్టల్ రెగ్యులేషన్స్ జోన్ (సీఆర్‌జెడ్) యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి కాపికో రిసార్ట్ సంస్థ సెవన్ స్టార్ ప్రయివేట్ రిసార్ట్, 54 ఖరీదైన విల్లాలను నిర్మించింది. రూ.200 కోట్ల ఖరీదుతో.. 36 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ప్రీమియం విల్లాల నిర్మాణ పనులు 2012లో పూర్తయ్యాయి. ఈ విల్లాలో ఒక రాత్రి గడపాలంటే రూ.55 వేలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అంత ఖరీదైన విల్లాలు ఇవి. అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాలు కావడంతో చట్టపరమైన ఇబ్బందులు తలెత్తాయి. ఈ విల్లాల నిర్మాణం కారణంగా తమ జీవనోపాధికి గండిపడుతుందని స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందారు. విల్లాల నిర్మాణానికి అడుగులు పడిన 2008-09 నుంచే వారు కోర్టును ఆశ్రయించారు.
ముత్తూట్, కువైట్‌కు చెందిన కాపికో గ్రూప్‌లు 2007లో ఈ అక్రమ విల్లాల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మొదలుపెట్టాయి. దీన్ని సవాల్ చేస్తూ మత్స్యకారులు కొందరు స్థానిక కోర్టుకు వెళ్లారు. అక్కడ న్యాయం జరగకపోవడంతో 2010లో కేరళ హైకోర్టుకు వెళ్లారు. సీఆర్‌జెడ్ నిబంధనలను ఉల్లంఘించిన చేపట్టిన ఈ నిర్మాణాలను కూల్చేయాలని 2013 మార్చిలో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే రిసార్ట్ యజమానులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పుతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం.. అక్కడి నిర్మాణాలను కూల్చేయాలని 2020లో ఆదేశాలు జారీ చేసింది.
అయితే కోవిడ్, ఇతర కారణాలతో రెండేళ్లపాటు కూల్చివేతలు జరగలేదు. కానీ అలప్పుజ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కృష్ణ తేజ ఈ అక్రమ నిర్మానాలపై దృష్టి సారించారు. దీంతో ఆ రిసార్ట్ యజమానులు.. తమ ఖర్చుతోనే నిర్మాణాలు కూల్చివేసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలో ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా కృష్ణ తేజ వెనక్కి తగ్గలేదు. త్రిసూరు జిల్లా కలెక్టర్‌గా జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.