రుషికొండ ప్యాలెస్.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉన్న అంశం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విలేకర్లతో కలిసి ఈ ప్యాలెస్‌లోకి వెళ్లడం, ప్యాలెస్ లోపలి దృశ్యాలు బయటకు రావటంతో.. ఈ పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అలాగే ఈ వీడియోలు నెట్టింట వైరల్ కావటంతో రుషికొండ భవనాలు జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి. అయితే రుషికొండ భవనాలను కొనేందుకు ఓ కీలక వ్యక్తి ముందుకొచ్చారు. మనీలాండరింగ్ కేసుల్లో జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్.. రుషికొండ భవనాలను కొనేందుకు ఆసక్తిని చూపారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వానికి లేఖరాసినట్లు తెలుస్తోంది.
రుషికొండ భవనాలను రూ.500 కోట్లు ఖర్చు చేసి నిర్మించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ ధర కంటే 20 శాతం ఎక్కువ చెల్లిస్తానని సుకేష్ చంద్రశేఖర్ ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.సుకేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్, మోసం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రుషికొండ భవనాలను కొనేందుకు లేదా లీజుకు తీసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖరాసినట్లు తెలిసింది. తన లాయర్ ద్వారా ఈ లేఖను పంపినట్లు సమాచారం.
అయితే రుషికొండ ప్రాపర్టీని అమ్మేందుకు లేదా లీజుకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే తన అభ్యర్థనను పరిశీలించారని సుకేష్ అందులో కోరారు. మార్కెట్ ధర కంటే 20 శాతం ఎక్కువే చెల్లిస్తానని ఆఫర్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ లేఖను లెటర్ ఆఫ్ ఇంటెంట్‌గా పరిగణించాలని సుకేష్ చంద్రశేఖర్ కోరినట్లు తెలిసింది. రుషికొండ భపనాలపై తన ఆసక్తికి కారణం.. వైజాగ్‌లో తన కుటుంబానికి ఉన్న మూలాలేనని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. తన చిన్నతనంలో సెలవుల్లో అమ్మమ్మ అక్కడికి తీసుకెళ్లినప్పుడు ఆ ప్రాంతంలో ఆడుకునేవాడినని లేఖలో రాసుకొచ్చారు.
ఒకవేళ తన అభ్యర్థనకు అంగీకరిస్తే నగదు చెల్లింపులు వందశాతం లీగల్‌గా చెల్లిస్తానని పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో అప్పటి సీఎం వైఎస్ జగన్ రూ.500 కోట్లు ఖర్చుచేసి రుషికొండపై భవనాలను నిర్మించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శిస్తున్నారు.