చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందని.. హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైయస్ఆర్‌సీపీ కార్యాలయాన్ని కూల్చేశారని మాజీ ఏఏజీ, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీస్‌లు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారన్నారు. పాలకులు మారొచ్చు.. కానీ చట్టం మారదు. న్యాయవ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని, ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులు న్యాయవ్యవస్ధ ఆదేశాలను తుంగలో తొక్కారని మాజీ అడ్వొకేట్ జనరల్ పొన్ననోలు సుధాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చట్టం, కోర్టులు వాటి ఆర్డర్లు తెలిసిన వ్యక్తిగా అవి బేఖాతరు అయిన పరిస్థితుల్లో, లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. సూర్యోదయానికి ముందే సుమారు 4 గంటలకు మొదలుపెట్టి… కోర్టు ఆర్డరు ఉన్నా వైయస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చి వేశారని... కొన్ని వందల మంది పోలీసులు సమక్షంలో… జేసీబీలు, ప్రొక్లెయినర్లతో వైయస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన విధానాన్ని కచ్చితంగా ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పొన్నవోలు తేల్చిచెప్పారు. కోర్టులో పోరాడిన వ్యక్తిగా… అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.