పార్టీ ఆఫీసులకు స్థలాలు కేటాయింపు విషయానికి ఆధ్యుడు చంద్రబాబేనని వైసీపీ నేత సుధాకర్ బాబు గుర్తు చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ పేరుతో ప్రస్తుతం ఉన్న భవనం.. గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉండేదన్నారు. ఆ స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్ పేట ఎమ్మార్వోకు బదలాయించారని, 1997 ఏప్రిల్ 30న డి. శ్రీనివాస్ అనే పేరుతో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవనానికి కేటాయించారని తెలిపారు. శిక్షణా తరగతుల పేరిట పేద విద్యార్థులకు చదువు బాగా నేర్పించడానికి ఉపయోగిస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్టుకు బదలాయించారన్నారు. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ హైదరాబాద్ మార్కెట్ విలువ ప్రకారం రూ.1000 కోట్లుపైపనే ఉంటుందన్నారు. నారా చంద్రబాబునాయుడు 2014 నుంచి 2019 వరకు పాలించే సమయంలో రాజకీయ పార్టీలకు భూములు కేటాయించడం కోసం 2016 జూలై 21న టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జీవో కాపీని సుధాకర్ బాబు మీడియాకు చూపారు.