పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు పరిశీలనకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇంజనీరింగ్ నిపుణుల బృందం ఈ నెల 27న రాష్ట్రానికి రానుంది. ఈ బృందానికి డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో మూడు దశాబ్దాల అనుభవం ఉంది. విదేశీ బృందంలో ఇంజనీర్లు డేవిడ్ బి.పాల్(అమెరికా), రిచర్డ్ డోన్నెల్లీ(కెనడా), డియాన్ ఫ్రాన్స్ డి.సిక్కో(అమెరికా), సీన్ హిచ్‌బర్గర్(కెనడా) ఉన్నారు. ఈ బృందం ఈ నెల 27 నుంచి జూలై 5 వరకు తొమ్మిది రోజులపాటు పోలవరం ప్రాజెక్టులో మకాం వేసి ప్రాజెక్టు నిర్మాణంలో ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్, ఎగువ, దిగువ కాపర్ డ్యాంల సీపేజీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇతర ప్రతిబంధక సమస్యల అంశాలను పరిశీలించనుంది. అనంతరం పోలవరం ప్రాజెక్టు అఽథారిటీకి నివేదికలు సమర్పించనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో కటాఫ్ వాల్‌గా నదీ గర్భంలో నిర్మించిన డయాఫ్రంవాల్ 2020లో సంభవించిన వరదలకు కొంతమేర దెబ్బ తినడంతో దానికి సమాంతరంగా మరో డయాఫ్రంవాల్ నిర్మించాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రతిపాదించింది. దీనిపై ఈ బృందం అభిప్రాయాన్ని వెల్లడించనుంది. గతంలో జరిగిన అధ్యయనాలు.. ఎగువ కాపర్ డ్యాం నుంచి అధికంగా వెలువడుతున్న సీపేజీ అరికట్టడానికి రసాయనిక జెట్ గ్రౌటింగ్ ప్రక్రియ, సీపేజీ జలాల తీవ్రత తెలియజేసే ఫిజియో మీటర్లు ఏర్పాటు చేయడం వంటి వాటి విషయంలో కొన్ని సూచనలు చేశాయి. ఆ సూచనలు ఎంతమేరకు పని చేస్తాయో కూడా ఈ బృందం పరిశీస్తుంది. నదీ గర్భం కోతను పూడ్చేందుకు వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్ కాలమ్‌ల ఏర్పాటు అంశాలపై కూడా ఈ బృందం అధ్యయనం చేసి తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ మార్గాలను చూపవలసి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు అథార్టీల సిఫారసు మేరకు నియమించిన ఈ బృందం ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించి సాంకేతిక సలహాలు సూచనలు చేయనుంది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ఇంజనీరింగ్ సిబ్బందికి, అధికారులకు సాంకేతిక సలహాలు, సూచనలు అందించనుంది.