కలెక్టరేట్‌లోని వినతుల విభాగం సరికొత్తగా సిద్ధమైంది. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌డే ఈసారి కొత్తపేరుతో ప్రజల వద్దకు వస్తోంది. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుతీరడంతో పేరుమార్చింది. సుదీర్ఘ విరామం(దాదాపు నాలుగు నెలలు) అనంతరం ప్రజా సమస్యలపై అధికారులు వినతిపత్రాలు స్వీకరించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయంలో ఉన్న జగనన్నకు చెబుదాం కార్యక్రమం పేరును మార్పు చేసి ‘ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక’గా నామకరణం చేశారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్‌లో అర్జీలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే కౌంటర్లను సిద్ధం చేశారు. ఆన్‌లైన్‌లో లోగోను కూడా మార్పు చేశారు. గతంలో ప్రతి వారం 200 నుంచి 350 వరకూ వివిధ సమస్యలపై వినతులు అందేవి. 80 శాతం రెవెన్యూ సమస్యలపైనే వచ్చేవి. అయితే వచ్చిన వినతులన్నీ పరిష్కారం చేసినట్లు ఆన్‌లైన్‌లో చూపించారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిష్కారం కాక పదే పదే అవే సమస్యలతో అర్జీదారులు మళ్లీ మళ్లీ విన్నపాలు ఇచ్చేశారు. కొన్ని వినతులు మండల స్థాయిలో పరిష్కారం చేసే అవకాశం ఉన్నా అక్కడ పట్టించుకోకపోవడంతో అర్జీదారులు కలెక్టరేట్‌కు అతి కష్టం వచ్చేవారు. ఇక్కడా పరిష్కారం కాక నిరాశతో ఉండేవారు. కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వం ప్రజల నుంచి స్వీకరించిన వినతులకు మెరుగైన పరిష్కారం త్వరగా చూపాలని ప్రజలు కోరుతున్నారు.