వైసీపీ పార్టీ మీద, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తన వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్.. ఈ విషయమై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చించినట్లు బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడిచిందన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. నియంత పాలనను అందుకే జనం తిరస్కరించారని విమర్శించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకుండా.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అపూర్వ విజయాన్ని అందించారని అన్నారు. ఘోర ఓటమితో ప్రస్తుతం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఉన్నారని.. అందుకే బెంగళూరులో డీకే శివకుమార్‌తో చర్చించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
"వైఎస్ జగన్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ అయ్యి.. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే.. తన పార్టీని విలీనం చేస్తాననే నిస్సహాయత స్థితికి వెళ్లిపోయారు. 11 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది తనతో ఉంటారో తెలియని పరిస్థితి. నలుగురు ఎంపీలలో ఎంత మంది తనతో ప్రయాణిస్తారో తెలియని పరిస్థితి. రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితిలో జగన్ ఉన్నారు" అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు. తమ ఎంపీలు ఎవరూ పార్టీ మారడం లేదని.. అలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు.
మరోవైపు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే.. ఆయన తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014లో టీడీపీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఓటమి ఎదురైంది. వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి చేతిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 55 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే పార్టీని నమ్ముకుని ఐదేళ్లు అలాగే కొనసాగిన నల్లమిల్లికి 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో షాక్ తగిలింది.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనపర్తి సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. ఆ పార్టీ తరుఫున అభ్యర్థిని సైతం ప్రకటించారు. అయితే తొలుత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించి.. ఆ తర్వాత బీజేపీకి ఇవ్వటంతో తెలుగుతమ్ముళ్లు భగ్గుమన్నారు. దీంతో పార్టీలో పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. వ్యూహాత్మకంగా నల్లమిల్లిని బీజేపీలోకి పంపించారు. ఆ పార్టీ తరుఫున పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.