ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. ఇప్పటి వరకూ రేషన్ సరుకులను ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేస్తూ వచ్చారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ విధానం తీసుకువచ్చారు. రేషన్ సరుకులను ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్లవద్దకే పంపిణీ చేస్తూ వచ్చారు. వాలంటీర్ల పర్యవేక్షణలో వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరుగుతూ వచ్చింది. అయితే.. ఇకపై ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. అయితే అన్నిచోట్లా కాదు. కేవలం గిరిజన ప్రాంతాల్లో మాత్రమే ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీని నిలిపివేస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకుల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం గిరిజన ప్రాంతాల్లో 960 రేషన్ షాపులను పునరుద్ధరిస్తామని మంత్రి వెల్లడించారు.
గత వైసీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోని రేషన్ దుకాణాలను రద్దుచేసిందన్న మంత్రి.. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలను తిరిగి ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గిరిజన హాస్టళ్లలో ఏఎన్ఎంలను నియమిస్తామని.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఫీడర్ అంబులెన్సులను తిరిగి తెస్తామని స్పష్టం చేశారు. అలాగే గిరిజన బాలికల హాస్టళ్లలో మహిళా వార్డెన్లను నియమిస్తామని మంత్రి చెప్పారు. మరోవైపు అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా చైన్ షాపులు పెట్టనున్నట్లు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతామని వెల్లడించారు.
మరోవైపు గిరిజన ప్రాంతాల్లో ఎండీయూల ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేస్తామన్న మంత్రి ప్రకటనపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. వైఎస్ జగన్ తెచ్చిన ఇంటింటికీ రేషన్ పంపిణీకి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోందని ఆరోపించింది. గిరిజన ప్రాంతాల ప్రజలకు మళ్లీ తిప్పలు తెస్తోందంటూ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం చేస్తూ నిన్న తీర్మానం చేసిన ప్రభుత్వం.. నేడు ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుందంటూ ట్వీట్ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో రేషన్ షాపుల వద్ద మళ్లీ క్యూలైన్లు తప్పవంటూ విమర్శించింది.