ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనేదానిపై ఓవైపు సంధిగ్ధత నెలకొంది. రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశం తర్వాత కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. పైపెచ్చు.. జులై నెల పింఛన్లను కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంకో పక్క ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు.. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కోరుతున్నారు. వైసీపీ నేతల బలవంతంతోనే రాజీనామాలు చేశామంటూ పోలీస్ స్టేషన్ల గడప తొక్కుతున్న పరిస్థితి. ఈ రెండు అంశాలు ఇలా ఉన్న సమయంలోనే ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుమారుగా 63 వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. వీరిలో చాలా మంది వైసీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే ఈ మూకుమ్మడి రాజీనామాలను ఆమోదించవద్దంటూ భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్రయాదవ్ ఎన్నికలకు ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి రాజీనామాలను ఆమోదిస్తే ఎన్నికలపై ప్రభావం పడుతుందని పిటిషనర్ ఆరోపిస్తూ వచ్చారు. పోలింగ్ ముగిసేవరకూ రాజీనామాలు ఆమోదించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అయితే ఆ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా మంగళవారం మరోసారి విచారణ జరిగింది.
విచారణ సందర్భంగా వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ వాలంటీర్లు పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తున్న విషయాన్ని పిటిషనర్ తరుఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే మూకుమ్మడి రాజీనామాల అంశంపై తేల్చాలని కోరారు. ఈ అంశం మీద ప్రస్తుత ప్రభుత్వం వైఖరిని, కేంద్రం ఎన్నికల సంఘం వైఖరిని కోరాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు.. మూకుమ్మడి రాజీనామాల విషయంలో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను వచ్చే నెల (జులై) 22కు వాయిదా వేసింది.