విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ), రియల్టర్ గద్దె బ్రహ్మాజీపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవోయూ పేరుతో ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్‌స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు సంబంధించిన విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈనెల 22న ఎఫ్ఐఆర్ నెంబర్ 227/2024 కింద 10 పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసులపై సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.. ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఎంవీవీ సత్యనారాయణకు జీవీఎంసీ (గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ) కూడా ఇటీవల షాకిచ్చింది. సత్యనారాయణకు చెందిన ఎంవీవీ పీక్ వెంచర్లో జరుగుతున్న పనులకు స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అశీల్ మెట్ టైకూన్ కూడలి దగ్గర సీబీసీఎన్సీ స్థలంలో ఎంవీవీ వెంచర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఎంవీవీ పీక్ వెంచర్ విశాఖపట్నం నడిబొడ్డున రూ. వందల కోట్ల విలువ చేసే 4.5 ఎకరాలలో నిర్మాణాలు చేస్తున్నారు.
వెంచర్ నిర్మాణం జరుగుతున్న స్థలంలో ఉన్న రాళ్లను తొలగించేందుకు నిర్మాణ సంస్థ పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ జరుపుతోంది. దీంతో సమీపంలో ఉన్న భవనాల పునాదులు దెబ్బ తింటున్నాయని స్థానికులు జీవీఎంసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జీవీఎంసీ కమిషనర్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పనులు నిలిపివేయాలని ఎంవీవీ పీక్ వెంచర్‌ను ఆదేశించగా.. స్టాప్ వర్క్ ఆర్డర్ ఇచ్చారు.