ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నకు వైఎస్ జగన్ స్పెషల్ రిక్వెస్ట్.. ఓకే చెప్తారా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 08:02 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్దతులకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉందని.. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని.. పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకాని ఈ నిబంధన పాటించలేదని లేఖలో పేర్కొన్నారు జగన్.


ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారని లేఖలో జగన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ -1953 చట్టంలోని 12-Bలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించారని ఆ అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోందన్నారు.


టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకున్నాయని.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో వైఎస్సార్‌సీపీ మాత్రమే ఉందన్నారు జగన్. జూన్ 21న అసెంబ్లీలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్షంగా గుర్తించడంలో.. పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా తనకు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో అధికార పార్టీ ఉద్దేశాలేంటో బయటపడ్డాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 40శాతం ఓట్లను సాధించిందని లేఖలో ప్రస్తావించారు జగన్. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యకలాపాల్లో కట్టడి చేస్తున్నట్లే అవుతుందన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుందన్నారు. అసెంబ్లీలో వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదన్నారు.


అసెంబ్లీ సీట్లలో 10శాతం సీట్లు రాలేదనే కారణంతో వైఎస్సార్‌సీపీ శానసభాపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోందన్నారు. భారత రాజ్యంగా ప్రకారం ఆర్టికల్-208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో పలానా సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేశారు జగన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని లేఖలో గుర్తు చేశారు. 1984 లోక్‌సభలో 543 స్థానాలకు ఎన్నికలు జరిగితే.. టీడీపీ 30 ఎంపీ సీట్లు గెలుచుకుందని.. అప్పుడు సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారని లేఖలో ప్రస్తావించారు జగన్.


1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు మాత్రమే వచ్చాయని.. 10శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీకి లేకపోయినా.. పి జనార్థన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారన్నారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు.. బీజేపీ కేవలం 3 సీట్లు వచ్చినా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నారు. ఈ అంశాలను కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా స్పీకర్ దృష్టికి తీసుకు వస్తున్నానని.. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈలేఖ రాస్తున్నట్లు తెలిపారు. తాను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద.. తనను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యాబలాలను దృష్టిలో ఉంచుకుని ఈలేఖను పరిశీలించాలని కోరారు జగన్. ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని.. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది అన్నారు. కాబట్టి ప్రతిపక్ష హోదా అంశాన్ని పరిశీలించాలని జగన్ స్పీకర్‌ను లేఖ ద్వారా కోరారు.


మరోవైపు కూటమి ప్రభుత్వం శుక్రవారం జరిగి అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్‌కు తగిన గౌరవం ఇచ్చామని చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది.. దీంతో ఆ పార్టీకి, జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదనేది కూటమి నేతల వాదన. అయితే మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా ఆయన కూడా సాధారణ సభ్యుడు మాత్రమే అంటున్నా కూటమి పార్టీల నేతలు. అయితే జగన్‌కు సభలో ప్రాధాన్యమివ్వాలని వైఎస్సార్‌సీపీ తమను రిక్వెస్ట్ చేసిందన్నారు శాసన సభావ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌‌. ఈ విషయాన్ని తాను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. మాజీ సీఎం పట్ల ఉదారంగా, గౌరవంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన చెప్పుకొచ్చారు.


సాధారణ ఎమ్మెల్యేలు తమ వాహనాలను అసెంబ్లీ ప్రాంగణం బయటే ఉంచాలి.. అక్కడ దిగి నడుచుకుంటూ అసెంబ్లీ లోపలికి రావాాల్సి ఉంటుందని.. కానీ జగన్‌ తన వాహనంలోనే సభ ప్రాంగణం లోపలికి కూడా రావడానికి అనుమతించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్లు చెప్పుకొచ్చారు. ప్రమాణ స్వీకారం విషయంలో కూడా ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి తగిన సంఖ్యాబలం లేకపోయినా.. జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా.. ఆయనకు అధికార పక్షం గౌరవం ఇస్తుందని సభావ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ కూడా స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి తనకు రిక్వెస్ట్ వచ్చిందని.. ఈ విషయం సీఎం చంద్రబాబుకు చెప్పగానే.. ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు. అందుకే జగన్‌కు తగిన గౌరవం ఇస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com