ఓ రైతు తన పొలం కోసం పడిన ఆవేదన కన్నీళ్లు పెట్టిస్తోంది.. న్యాయం చేయండయ్యా అంటూ తహసీల్దార్ కాళ్లపై పడి వేడుకున్న ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. దామగట్లకు చెందిన రైతు మధుసూదన్ యాదవ్ తన పొలం విషయంలో వివాదం గురించి నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. అక్కడ తన కుంటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహిస్తుండగా కుటుంబ సభ్యులతో అక్కడికి వెల్లారు.
తన పొలాన్ని బంధువులు వారి పేరు మీద అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకున్నారని.. అది ఆన్‌లైన్ నుంచి తొలగించి తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ పొలం తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తోందని.. తమ పేర్లపై మ్యాన్యువల్ రికార్డులు ఉన్నాయని మధుసూదన్ చెబుతున్నారు. అయితే స్థానిక వీఆర్వో తమ బంధువులకు అక్రమంగా ఈ పొలాన్ని ఆన్‌లైన్ చేశారని ఆరోపించారు. నాలుగేళ్లుగా ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పొలం విషయాన్ని ఆర్డీవో, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా న్యాయం చేయాలని తహసీలార్ కాళ్లపై పడి వేడుకున్నారు.. ఈపరిణామంతో కంగుతిన్న తహసీల్దార్ అలా చేయొద్దంటూ రైతును పైకి లేపారు.