ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.. కొందరు తెలుగులో, కొందరు ఇంగ్లీష్‌లో ప్రమాణం చేయగా.. అరకు ఎంపీ తనూజ హిందీలో ప్రమాణం చేయడం విశేషం. అయితే ఈసారి ఏపీ నుంచి గెలిచిన వారిలో.. ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సీనియర్‌గా ఉన్నారు. ఆయన ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు (1998, 2004, 2009, 2019, 2024)ల్లో ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు ఆయనే రాష్ట్రం నుంచి సీనియర్ ఎంపీగా ఉన్నారు.
ఆ తర్వాత కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మూడుసార్లు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి (2014, 2019, 2024) గెలిచారు. దగ్గుబాటి పురందేశ్వరి మూడుసార్లు (2004 (బాపట్ల), 2009 (విశాఖపట్నం), 2024 (రాజమహేంద్రవరం) విజయం సాధించారు. వల్లభనేని బాలశౌరి (2004 (తెనాలి లోక్‌సభ), 2019 (మచిలీపట్నం), 2024 (మచిలీపట్నం) నుంచి గెలుపొందారు. పీవీ మిథున్‌రెడ్డి (రాజంపేట), వైఎస్ అవినాష్‌రెడ్డి (కడప) (2014, 2019, 2024) మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అనకాపల్లి నుంచి గెలిచిన సీఎం రమేష్ 2012 నుంచి 2024 వరకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2018 నుంచి 2024 వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రస్తుతం నెల్లూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), మద్దిల గురుమూర్తి (తిరుపతి) వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచారు. హిందూపురం ఎంపీ పార్థసారథి 1999లో ఎంపీగా గెలిచి.. మళ్లీ ఇప్పుడు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 14 మంది తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం 25 మందిలో ముగ్గురు మహిళలు (బైరెడ్డి శబరి, దగ్గుబాటి పురందేశ్వరి, తనూజ రాణి) ఉన్నారు.