ఏపీలో అక్కడక్కడా వర్షాలు కొనసాగుతున్నాయి.. రుతుపవనాల ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు,తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు.
మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించినా వాతావరణం మాత్రం ఇంకా చల్లబడ లేదు. అయితే వచ్చే రెండు, మూడు రోజుల్లో కోస్తాలో పలుచోట్ల వానలు కురుస్తాయి అంటున్నారు. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. 26, 27 తేదీల్లో కోస్తాలో ఎక్కువచోట్ల వానలు, ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. అయితే అక్కడక్కడా ఎండలు కొనసాగుతున్నాయి.. అలాగే మధ్యాహ్నం వరకు ఎండ, ఆ తర్వాత వానలు పడతాయంటున్నారు.