టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై అసభ్యరమైన పోస్ట్‌లు పెట్టిన వైఎస్సార్‌సీపీ నేత క్షమాపణలు చెప్పారు. మోకాళ్లపై నిలబడి తనను క్షమించాలని కోరారు.. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేయగా.. వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై గతంలో సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టానని.. అందుకు తనను క్షమించాలంటూ.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొత్తపల్లగిరికి చెందిన వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యుడు వేల్పుల జైహింద్ కోరారు.
తాను తంగిరాల సౌమ్యపై, ఆడపిల్లలపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు.. తాను, తన కుటుంబం ఎంతో బాధపడుతున్నాయన్నారు జైహింద్. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను తెలిసీ తెలియక వైఎస్సార్‌సీపీ నేతల దగ్గర సోషల్‌మీడియా కార్యకర్తగా పనిచేసి అసభ్యకర పోస్టులు పెట్టానని చెప్పుకొచ్చారు. తాను ఇకపై ఇలాంటి పోస్టులు పెట్టనని.. చేసిన తప్పునకు క్షమించాలని మోకాళ్లపై కూర్చుని వేడుకున్నారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కలిసి తనను క్షమించాలని జైహింద్ ప్రాధేయపడినట్లు తెలుస్తోంది.
'గత ప్రభుత్వంలో గౌరవ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్యగారిపై, ఆడవాళ్లపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినందుకు.. నేను ఎంతో బాధపడుతున్నాను, నా కుటుంబం కూడా మానసికంగా క్షోభనకు గురవుతోంది. భవిష్యత్‌లో ఎలాంటి పోస్ట్‌లు పెట్టకుండా.. భవిష్యత్‌లో నేను ఏ ఆడపిల్ల మీద పిచ్చి, పిచ్చి పోస్టులు పెట్టకుండా ఉంటాను. గతంలో తంగిరాల సౌమ్య మాకు ఇల్లు కట్టించి.. మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేశారు. కానీ నేను విశ్వాసం లేకుండా, తెలిసీ తెలియక ఏదో మంచి చేస్తారని ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ నేతల దగ్గర పనిచేసి పోస్టులు పెట్టాను. ఈ తప్పు భవిష్యత్‌లో ఇంకెప్పుడు చేయను.. ఏ ఆడపిల్లపై ఎలాంటి పోస్టులు పెట్టను, దయచేసి నన్ను క్షమించండి' అని కోరారు.