ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది. అధికారంలోకి వచ్చాక పాలనలో ప్రక్షాళన ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం.. ఇప్పటికే అనేక పథకాల పేర్లు మార్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్ల స్థానంలో కొత్తవాటిని చేర్చుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ బీమా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ పెన్షన్ కానుక వంటి పేర్లను మార్చిన ప్రభుత్వం.. తాజాగా మరో పథకం పేరు మార్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్ సైట్‌లో మార్పులు చేశారు. అన్నదాత సుఖీభవ వెబ్ సైట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచారు.
అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని 2019లోనే చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తీసుకువచ్చిన టీడీపీ ప్రభుత్వం.. కేంద్రం అందించే పీఎం కిసాన్ యోజన పథకంతో పాటుగా అమలు చేసింది. పీఎం కిసాన్ యోజన కింద ఏడాదికి ఆరువేలు పెట్టుబడి సాయం కింద అందించగా.. ఆ రూ.6000లకు రాష్ట్రం ఇచ్చే రూ.9000 కలిపి 15 వేల రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందించేలా పథకం తీసుకువచ్చారు. అయితే 2019 ఫిబ్రవరి సమయంలో ఈ పథకం తీసుకురాగా.. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది.
అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది. పీఎం కిసాన్ యోజన కింద అందించే రూ.6000లతో పాటుగా వైసీపీ ప్రభుత్వం రూ.7500 లు కలిపి ఏడాదికి రూ.13,500లను రైతులకు అందిస్తూ వచ్చారు. ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా అందిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకం పేరును తిరిగి అన్నదాత సుఖీభవగా మార్చింది.
మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.20000 సాయంగా అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చిన నేపథ్యంలో.. ఈ పథకం అమలుపైనా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.