ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించడంతో అమరావతిపై అందరి దృష్టి నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు రాజధాని నిర్మాణం కోసం విరాళాలు కూడా అందిస్తున్నారు. ఇటీవలే ఓ వైద్య విద్యార్థిని సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి అమరావతి కోసం రూ,25 లక్షలు విరాళం అందించిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లా మహిళలు అమరావతి కోసం భారీగా విరాళం అందించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా సభ నిర్వహించారు.
ఇక ఈ సభలోనే చిత్తూరు జిల్లా మహిళలు అమరావతి నిర్మాణానికి భారీ విరాళం అందించారు. చిత్తూరు జిల్లాలోని డ్వాక్రా సంఘాల మహిళలు రూ.4.5 కోట్లు విరాళంగా అందించారు. అలాగే మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్టు తరుఫున మరో కోటి విరాళంగా ఇచ్చారు. ఈ చెక్కులను కుప్పంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. అంతకుమందు సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. చిత్తూరు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా కుప్పంపై వరాలు కురిపించారు.
కుప్పంలో త్వరలోనే ఎయిర్ పోర్టు తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఎయిర్ కార్గో ద్వారా స్థానిక ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం వస్తుందని.. ఆ రకంగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. కుప్పంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని .. భవిష్యత్తులో కుప్పం రైల్వే జంక్షన్‌గా మారే అవకాశం ఉందని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఊరిలో స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీలు, తాగునీరు ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మినరల్ వాటర్ పంపిణీ చేస్తామన్నారు. కుప్పంలో జన్మించడం గర్వంగా ఉందన్న చంద్రబాబు.. మరో జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే కుప్పం నియోజకవర్గానికి వరాలు కురిపించిన చంద్రబాబుకు.. సభ ఆఖర్లో చిత్తూరు జిల్లా మహిళలు విరాళం అందజేశారు. అమరావతి నిర్మాణానికి రూ.4.5 కోట్లు విరాళం అందించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని స్థానికులు, నెటిజనం అభిప్రాయపడుతున్నారు.