బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన ఓ వ్యక్తిపై సుత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన సోమవారం పట్టణంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కోటవురట్ల మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన వబ్బలరెడ్డి ప్రసాద్ నర్సీపట్నంలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ బైక్‌పై ఆఫీసుకు వెళ్లి వస్తుంటాడు. సోమవారం ఉదయం ప్రసాద్ బైక్‌పై ఎండపల్లి నుంచి నర్సీపట్నం ఆఫీసుకి బయలు దేరాడు. అదే గ్రామానికి చెందిన సుర్ల జమీలు నర్సీపట్నం వరకు లిఫ్ట్ అడిగాడు. మార్గమధ్యంలో కెన్విన్ స్కూల్ రోడ్డులో తన బైక్ ఉండి పోయిందని, లోపలికి తీసుకు వెళ్లాలని కోరాడు. కొద్ది దూరం వెళ్లిన తరువాత బైక్ వెనుక కూర్చున్న జమీలు సుత్తితో ప్రసాద్‌పై దాడి చేశాడు. కింద పడిపోయిన ప్రసాద్ చేతుల మీద కరిచి తీవ్రంగా గాయపరిచాడు. అతని నుంచి ప్రసాద్ తప్పించుకుని సమీపంలో కూలీలు పని చేస్తున్న చోటుకు పరుగెత్తాడు. దాడి చేసిన జమీలు పరారయ్యాడు. ప్రసాద్ ఏరియా ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముఖ పరిచయం తప్పితే ఇద్దరి మధ్య ఎటువంటి లావాదేవీలు, గొడవలు లేవని ప్రసాద్ చెప్పాడు. లిఫ్ట్ అడిగాడని బైక్ ఎక్కించుకుంటే ఎందుకు దాడి చేశాడో అర్థం కావడం లేదని తెలిపాడు. జమీలు ఓ బైక్ షోరూంలో పని చేస్తుంటాడని చెప్పాడు. పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.