రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతకు పూనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు బ్రేకులు వేసింది. వైయస్ఆర్ సీపీ కార్యాలయాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వైయస్ఆర్‌సీపీ కార్యాలయాల భవనాల కూల్చివేతలపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాము చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తామని, కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అడ్వొకేట్ జనరల్ కార్యాలయ న్యాయవాదులు పదే పదే చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయం విషయంలో కూడా చట్టాన్ని అనుసరిస్తామంటూ కోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చి తెల్లారేసరికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, చట్ట ప్రకారం నడుచుకుంటామన్న ప్రభుత్వ న్యాయవాదుల వాదనను విశ్వసించలేదు. యథాతథస్థితిని కొనసాగించాలన్న తన ఉత్తర్వులకే కట్టుబడింది.