రాష్ట్రంలో రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్‌పుస్తకాలపై రాజముద్రే ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. మాజీ సీఎం జగన్ పేరు, ఆయన బొమ్మలు ముంద్రించిన పాస్‌పుస్తకాలను వెనక్కి రప్పించాలని యోచిస్తోది. ఎన్నికలకు ముందే వైఎ్‌సఆర్ జగనన్న శాశ్వత భూహక్కు పథకం పేరిట రాష్ట్రంలో 4,618 గ్రామాల్లో 20.19 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతులకు అందించారు. వాటిపై జగన్, ఆయన తండ్రి, తాత పేరు కలిసివచ్చేలా వైఎ్‌సఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, జగనన్న భూహక్కు పత్రం అని పేర్లు రాసుకొచ్చారు. పుస్తకంలోని పేజీల నిండా జగన్ కలర్ ఫొటోలు ముద్రించారు. రైతు ఫొటో మాత్రం చాలా చిన్నదిగా ముద్రించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక కథనాలు ప్రచురించింది. భూమి రైతుదా? జగన్‌దా? పాస్‌పుస్తకం జగన్‌దా? రైతుదా అని అనుమానాలు కలిగేలా ఉండటంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలామంది రైతులు వాటిని బహిరంగ వేదికలు, తహసీల్దార్ కార్యాలయాల వద్దే చించివేశారు. కొందరయితే ఏకంగా తగులబెట్టారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే వాటిని తొలగిస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. బుధవారం ఇదే అంశంపై సచివాలయంలోని తన కార్యాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షించారు. సీసీఎల్‌ఏ జి. సాయిప్రసాద్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, సర్వే కమిషనర్ సిద్ధార్థ్ జైన్ తదితర అధికారులు పాల్గొన్నారు. జగన్ బొమ్మలు, పేర్లతో రైతులకు అడ్డగోలుగా పాస్‌పుస్తకాలు అంటగట్టారని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘జగన్ బొమ్మ, ఆయన పేరుతో ఉన్న ప్రతీ పాస్‌పుస్తకాన్ని వెనక్కి తీసుకుంటాం. ఆ పేర్లతో ఉన్నవి ఏవీ రైతులకు పంపిణీ చేయకూడదు. ఇప్పటికే రైతులకు పంపిణీ చేసిన వాటిని వెనక్కి రప్పించాలని(రీకాల్) ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై రైతులకు ఇచ్చే పాస్‌పుస్తకాలపై రాజముద్రే ఉంటుంది. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేస్తాం’ అని మంత్రి స్పష్టం చేసినట్లు తెలిసింది. సీఎంతో సమావేశం జరిగే నాటికి కొత్త పాస్‌పుస్తకాల డిజైన్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ లెక్కన 20.19 లక్షల మంది రైతులకు పంపిణీ చేసిన పాస్‌పుస్తకాలను వెనక్కి ర ప్పిస్తారు. వాటిని రైతులు సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో సమర్పించాలి. వాటి స్థానంలో కొత్త పాస్‌పుస్తకాలు జారీ చేస్తారు.