ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. కర్నూలు జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 5,711 మంది హాజరయ్యారు. ఇందులో 2,327 మంది విద్యార్థులు పాసై 41 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే జనరల్ కోర్సులో 1,770 మందికి గానూ 733 మంది విద్యార్థులు పాసై 41.41 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీఆర్ జూనియర్ కళాశాలలో 16 మందికి గానూ ఆరుగురు, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 168 మందికి గాను 49 మంది, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో 66 మందికి 45 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బీసీ రెసిడెన్షియల్ కళాశాలలో నలుగురిలో ఇద్దరు, ఇన్సెంటివ్ కళాశాలలో 19 మందికి నలుగురు, కేజీబీవీ కళాశాలలో 186 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 108 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మోడల్ స్కూల్‌లో 465 మందికి గానూ 215 మంది పాసై 46.24 శాతం ఉత్తీర్ణత సాదించారు. ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలో 89 మందికి గానూ 38 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆర్‌ఐవో గురువయ్యశెట్టి వెల్లడించారు.