ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో శుక్రవారం సచివాలయంలో సమీక్షించారు. యూనివర్సిటీల ర్యాంకులు మెరుగుపర్చాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడేలా కరికులమ్‌ను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ఇంజనీరింగ్ నాలుగేళ్లు చదివినా రాని ఉద్యోగం, అమీర్‌పేట్‌లో నాలుగు నెలల శిక్షణతో ఎలా వస్తుందనే ప్రశ్నను లేవనెత్తారు. ఇకపై ఇతరత్రా శిక్షణలు అవసరం లేకుండా కేవలం చదువుతోనే ఉద్యోగాలు వచ్చేలా కాలేజీల్లో తగిన శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేసి ప్రమాణాల పెంపునకు కృషి చేద్దామని అధికారులను కోరారు. గత ప్రభుత్వం అమలుచేసిన విద్యా దీవెన, వస తి దీవెనలో ఫీజుల చెల్లింపు విధానం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉండిపోయాయన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద వైసీపీ ప్రభుత్వం రూ.3,480 కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు. విద్యా సంస్థలతో మాట్లాడి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు.