ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల కారణంగా నిత్యం ఎక్కడో ఓ చోట మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోలీసులు కూడా ఇలాంటి డేటింగ్ యాప్‌లను నమ్మి.. డబ్బులు పోగొట్టుకోవద్దని హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టిండర్ యాప్ అనే డేటింగ్ యాప్‌తో ఓ వ్యక్తి ఏకంగా రూ.1.22 లక్షలు కోల్పోయిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు.. టిండర్ యాప్‌లో ఓ యువతిని కలిసి బేకరీకి వెళ్లగా.. అక్కడ ఆ యువతి అతడ్ని సాంతం నాకేసింది. దీంతో చేసేదేమీ లేక ఆ యువకుడు బయటికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటికి వచ్చింది.
ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న యువకుడికి టిండర్ యాప్‌లో వెర్షా అనే యువతి పరిచయం అయింది. అయితే గత ఆదివారం తన బర్త్ డే అని చెప్పిన ఆ వెర్షా.. ఆ యువకుడిని ఓ బేకరీకి రమ్మని చెప్పింది. దీంతో ఉత్సాహంగా ఈస్ట్ ఢిల్లీ వికాస్ మార్గ్‌లోని బ్లాక్ మిర్రర్ కేఫ్‌కు వెళ్లిన ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. వారిద్దరూ కలిసి ఆ బేకరీలో స్నాక్స్, రెండు కేకులు, నాలుగు కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేశారు. వాటిని తింటూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత తనకు అర్జంట్ పని ఉందని చెప్పి వెర్షా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
తర్వాత ఆర్డర్ చేసిన పదార్థాలు తిన్న ఆ యువకుడు బిల్లు అడగ్గా.. అది చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ బిల్లు అక్షరాలా రూ.1,21,917.70 వచ్చింది. దీంతో ఆ కేఫ్ యాజమాన్యంతో యువకుడు గొడవకు దిగాడు. ఇక గట్టిగా స్పందించిన కేఫ్ నిర్వాహకులు.. యువకుడిని తిట్టి, నిర్భందించారు. రూ.1.22 లక్షల బిల్లు కట్టకపోతే వదిలేది లేదని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక తన వద్ద ఉన్న డబ్బులతో ఆ బిల్లును చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆ యువకుడు జరిగిన విషయం మొత్తం చెప్పి కేసు పెట్టాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇన్‌స్పెక్టర్ సంజయ్ గుప్తా నేతృత్వంలో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే దర్యాప్తులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఆన్ష్ గ్రోవర్, వాన్ష్ పాహవా అనే ఇద్దరు ఆ కేఫ్‌ను నడిపిస్తున్నారని.. అందులో పెద్ద దొంగల ముఠా ఉందని గుర్తించారు. ఆ ముఠాలోని అఫ్సాన్ పర్వీన్ అనే 25 ఏళ్ల యువతి ఉందని.. ఆమెను అడ్డం పెట్టుకునే ఆ ముఠా ఇలా దొరికిన వారిని దొరికినట్లు దోచుకుంటున్నట్లు తేలింది. వెర్షా అనే పేరుతో టిండర్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ చేసి.. యువకులతో పరిచయం పెంచుకుని ఇలా డబ్బులు లాగేస్తున్నట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా వారికి అఫ్సాన్ పర్వీన్ ఫోటోలు కూడా పంపేవారని పోలీసుల విచారణలో గుర్తించారు.