తమ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో తీవ్ర అవినీతికి పాల్పడుతున్న క్షేత్ర సహాయకురాలు బి.నాగమణిపై చర్యలు తీసు కోవాలని విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం, జోగులడుమ్మ ప్రజలు డిమాండ్‌చేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన పెద్దలు, వేతనదారులు ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ కె.రామారావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలో మొత్తం 255 జాబ్‌కార్డులు ఉంటే అందులో 481 మంది వేతనదారులు నమోదై ఉన్నారు. వీరిలో 441 మంది వేతనదారులు మాత్రమే పనికి వెళుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి వారం ఒక్కొక్క వేతనదారు నుంచి రూ. 100 వంతున వసూలు చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో లేని పనస భాస్కరరావు, పనస మవిత, బూరి రామారావు, బూరి గౌత మి, శివ్వాల గణేష్, శివ్వాల ధనలక్ష్మి, మజ్జి సతీష్, మజ్జి ప్రసన్నలక్ష్మి, చందక భుజం గరావు, చందక ప్రశాంతి, కరణం ఆదినారాయణ, కరణం గౌరీశ్వరి, చిన్ని గోపాలకృష్ణ, తదితరుల పేరున మస్తర్లు వేసి సగం డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేతనదారులకు ఇవ్వాల్సిన వేతన పుస్తకానికి రూ. 50 చొప్పున వసూలు చేసినట్టు పేర్కొన్నారు. ఈ గ్రామానికి చెందిన వై.శంకరరావు, శివ్వాల తవిటినా యుడు, వై.రాంబాబు, ఎస్.వెంకటరమణమూర్తి, ఎస్.తిరుపతి నాయుడు, చందక గౌరీశంకరరావు తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.