కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టాలతో పోలీసు దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు.‘గతంలో ఉన్న ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను ప్రభుత్వం రద్దు చేసి.. కొత్త చట్టాలను తెరపైకి తెచ్చింది. ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించిన కొన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త చట్టాలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తున్నాయి. గతంలో ఉన్న జీరో ఎఫ్‌ఐఆర్‌తోపాటు ప్రస్తుతం ఎలక్ర్టానిక్ ఎఫ్‌ఐఆర్‌ను ప్రవేశ పెట్టారు. 18 ఏళ్లలోపు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించేలా మార్పులు తీసుకొచ్చారు. ఎక్కడైనా అత్యాచారాలు, హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, దోపిడీలు తదితర ఘటనలు జరిగినప్పుడు పోలీసులు కచ్చితంగా ప్రతి ఆధారాలను వీడియోతీసి.. స్పష్టంగా కోర్టుకు సమర్పించాలి. కొన్ని నేరాల్లో కమ్యూనిటీ సేవలు పెంచడం జరిగింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 మేరకు గతంలో ఉన్న సీఆర్‌పీసీలోని 484 చట్టాలను 531కి పెంచారు. కొత్త క్రిమినల్ చట్టాల్లో స్ర్తీలు, పిల్లలపై నేరాలను సూచించే 37 విభాగాలను కలిగి ఉన్నాయి. మూడేళ్ల కంటే తక్కువ జైలు శిక్ష విధించదగిన నేరం విషయంలో డీఎస్పీ స్థాయి అధికారి కంటే తక్కువ లేని అధికారి ముందస్తు అనుమతి లేకుండా అరెస్టు చేయకూడదు’ అని ఎస్పీ వివరించారు.ఏఎస్పీలు వెంకట్రావు, విమలకుమారి పాల్గొన్నారు.