ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఉదయం కలెక్టరేట్‌లో పంచాయతీరాజ్, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం గొల్లప్రోలులో నివాసానికి బయలుదేరి వెళతారు. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యాయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై పవన్ చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అటవీశాఖ విస్తీర్ణత, అడవులను కాపాడుకునే అంశాలపై డిప్యూటీ సీఎం అధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలియవచ్చింది.కాగా నిన్న (సోమవారం) గొల్లప్రోలులో పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, జనసైనికులను అభినందించారు. జనసైనికులు పిఠాపురం అభివృద్ధికి, ఆఖరి శ్వాసవరకు కృషి చేస్తానని పవన్ ప్రమాణం చేశారు. ‘‘దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతాను. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను. కాలుష్యం లేని భారీ పరిశ్రమలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తా. విదేశాలకు వెళ్లే యువతకు అవసరమరైన శిక్షణ ఇప్పిస్తానని’’ పవన్‌కల్యాణ్ అన్నారు. అలాగే కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణంలోని సత్యకృష్ణ కల్యాణ మండపంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పథకం కింద లబ్ధిదారులకు పింఛన్ మొత్తాలను అందజేశారు. కాకినాడ జిల్లాలో 2,79,319 మంది లబ్ధిదారులకు రూ.118.40 కోట్లను అందజేశారు. ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి రక్షణ పేరుతో ఆంక్షలు పెట్టవద్దని, గతంలో జనవాణి, ఇతర సందర్భాల్లో ప్రజలను ఎలా కలుసుకునే వాడినో అలా కలుసుకోనివ్వాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పోలీసు యంత్రాంగానికి సూచించారు. ఇది టీడీపీ లీడ్ చేసే ప్రభుత్వం, జనసేన వెన్నదున్నుగా నిలిచిన ప్రభుత్వం, ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలు ఆశీస్సులు ఉన్న ప్రభుత్వం ఇదని తెలిపారు. కాకినాడ జిల్లాలో 627 గ్రామ, వార్డు సెక్రటేరియేట్‌లు, 6200 మంది సిబ్బంది. పిఠాపురం నియోజకవర్గంలో 120 సచివాలయాలు. ఒక్కొక్క సచివాలయంలో పది మంది ఉద్యోగులు వచ్చి పింఛన్లు ఇచ్చారని వివరించారు. వలంటీర్లు లేకపోయినా సమయానికి పింఛన్లు అందరికీ ఇళ్ల వద్ద అందాయన్నారు.