ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్, టీడీపీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, కీలకశాఖలకు మంత్రిగా వ్యవరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. ప్రజల సమస్యలను వినడంలోనూ, వాటికి సత్వరమే పరిష్కారం చూపించే విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా 9 నెలల కిందట తప్పిపోయిన ఓ అమ్మాయిని.. తన అమ్మ ఒడికి చేర్చారు పవన్ కళ్యాణ్. భీమవరానికి చెందిన ఓ మహిళ ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తన కూతురిని మాయమాటలు చెప్పి ఎవరో తీసుకెళ్లిపోయారంటూ పవన్ కళ్యాణ్ ముందు తన బాధలు చెప్పుకుంది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. భీమవరం పోలీసులతో ఈ విషయమై చర్చించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరపాలని సూచించారు. పవన్ జోక్యంతో కేసు దర్యాప్తు వేగం పుంజుకోగా.. ఆ భీమవరం అమ్మాయి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఆమెను వెనక్కి తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పవన్ ప్రస్తావించారు. 9 నెలల కిందట తప్పిపోయిన ఓ అమ్మాయిని.. తమ ప్రభుత్వం వచ్చాకా 48 గంటల్లో పోలీసులు గుర్తించారని పవన్ చెప్పారు. ప్రభుత్వం తలుచుకుంటే పోలీసు శాఖ ఎంత బాగా పని చేస్తుందో ఇదోక ఉదాహరణగా చెప్పారు.
మరోవైపు వైసీపీ పాలనలో ఏపీలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు రాజకీయంగా సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆడపిల్లల అదృశ్యం మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్..గత అయిదేళ్లలో ఎంత మంది ఆడపిల్లలు అదృశ్యమైనా వైసీపీ సర్కారులో కదలిక లేదన్నారు. పోలీస్ అధికారులతో మాట్లాడిన ఈ కేసుల మీద దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.