పవర్ స్టార్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పదమే ట్రెండ్ అవుతోంది. పవర్ స్టార్ అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకుంటే పొరబాటే. పవర్ స్టార్ పేరిట తెచ్చిన విస్కీ బ్రాండ్. ఇప్పుడు ఈ బ్రాండే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ శ్రేణుల నెట్టింట యుద్ధానికి కారణమవుతోంది. మొన్నటి దాకా తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిర్యానీ బీర్ గురించి చర్చ నడవగా.. ఇప్పుడు ఈ పవర్ స్టార్ బ్రాండ్ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. 999 పవర్ స్టార్ సుపీరియర్ విస్కీ పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ బ్రాండ్ విస్కీని అందుబాటులోకి తెచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది. నాణ్యమైన మద్యం అంటూ జనసైనికులను నమ్మించేందుకు ఇలా పవర్ స్టార్ పేరుతో విస్కీ బ్రాండ్ తెచ్చిందని ఆరోపించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో వైసీపీ ఈ ట్వీట్ చేసింది.
"పవర్ స్టార్ విస్కీ.. కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్! నాణ్యమైన మద్యం అంటూ జనసైనికుల్ని మెప్పించేలా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెరపైకి తెచ్చిన చంద్రబాబు సర్కార్.. ఏపీలో మాత్రమే ఈ బ్రాండ్ అందుబాటులోకి.. నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబూ అంటూ గగ్గోలు!" అంటూ వైసీపీ రాసుకొచ్చింది. అయితే విపక్ష వైసీపీ ఆరోపణలకు టీడీపీ శ్రేణులు కూడా ఇదే రీతిలో కౌంటర్ ఇస్తున్నాయి. పవర్ స్టార్ పేరుతో వైసీపీ పాలనలోనే ఈ బ్రాండ్ మద్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాయని టీడీపీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వార్తా కథనాలను, పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కూడా ఇందుకు జతచేస్తూ వైసీపీకి కౌంటర్‌గా టీడీపీ ట్వీట్ వదిలింది.
"జగన్ పాపాలు చేయడంలో శిశుపాలుడికి గాడ్ ఫాదర్. తానే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయి ఉండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్లలో ప్రమాదకర మద్యంతో లక్షలాది జనం ప్రాణాలు తీశారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్స్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, బూమ్ బూమ్, 99 పవర్ స్టార్ ఇవన్నీ జగన్ తెచ్చిన బ్రాండ్లు" అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ ట్వీట్‌లో జోడించింది. చివరకు పవర్ స్టార్ పేరుతో కూడా మద్యం బ్రాండ్లు తెచ్చారంటూ పవన్ కళ్యాణ్ అందులో ఆరోపించారు.
మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి గల కారణాల్లో ఈ నాసిరకం బ్రాండ్ మద్యం కూడా ఓ కారణమని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఫేమస్ బ్రాండ్లను పక్కనబెట్టి వివిధ రకాల పేర్లతో మద్యం తీసుకురావటం, వైసీపీ అనుసరించిన మద్యం పాలన కూడా తమ ఓటమికి కారణమని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలోనూ కూటమి నేతలు ఇదే విషయాన్ని పదే పదే ప్రచారం చేశారు. దీంతో ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అయితే అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం మందుబాబులను ఆకట్టుకునే దిశగా కింగ్ ఫిషర్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పేరుతో మద్యం బ్రాండ్ తెచ్చారంటూ వైసీపీ ఆరోపిస్తుండగా.. టీడీపీ ఆ ఆరోపణలను తిప్పికొడుతోంది.