తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుందన్నారు. ఒకేరోజు పట్టిసీమ, తాడిపూడి, పుష్కరం, పురుషోత్తపల్లి ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేయడం చరిత్ర అని గర్వంగా చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన జగన్, అంబటి రాంబాబు ఇప్పుడు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి కాంట్రాక్ట్ ఏజెన్సీని మార్చారని.. పోలవరం అథారిటీని, కేంద్ర జలవనరుల సంఘాన్ని పట్టించుకోకుండా కాంట్రాక్టర్‌ను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తప్పులు సరిదిద్దుకోకుండా విమర్శలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.