విశాఖ జిల్లాలో ప్రస్తుతం 938 మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ లేదని, గతంలో అమలు చేసిన మిషన్ కనెక్ట్ పాడేరు కార్యక్రమాన్ని పునఃప్రారంభించి పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జీకేవీధి మండలం సీలేరులో పర్యటించారు. ఈ సందర్భంగా జెన్‌కో అతిథి గృహంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు కనెక్టివిటీ చాలా ముఖ్యమని, దీనిపై దృష్టి సారించామన్నారు. గతంలో మంజూరై నిలిచిపోయిన ప్రత్యేక జనరల్ నిధులపై కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి ఆ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. మలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలలకు డిమాండ్ ఎక్కువగా ఉందని, దీని సీట్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. అలాగే పాడేరులో మరో రెండు రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. సీలేరులో కొత్తగా నిర్మించే పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై స్థానిక జెన్‌కో అధికారులతో చర్చించామన్నారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంపై స్థానికుల నుంచి, పార్వతీనగర్ గిరిజనుల నుంచి తమకు అందిన ఫిర్యాదులపై జెన్‌కో అధికారులతో చర్చించామని ఆయన తెలిపారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంశం, సీలేరులో 60 సంవత్సరాల క్రితం నివాసం కోసం జెన్‌కో మంజూరు చేసిన స్థలాల్లో ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో వారి పేరునే అలాట్‌మెంట్ ఇప్పించమని జీకేవీధి తహసీల్దార్, జెన్‌కో అధికారులను ఆదేశించినట్టు ఆయన చెప్పారు. ఆర్వీనగర్ నుంచి నూతిబంద వరకు అధ్వానంగా ఉన్న రహదారిని స్వయంగా పరిశీలించామని, ఈ రహదారికి అవసరమైన ప్రతిపాదనలను, అంచనాలను తయారు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించామన్నారు. అంతకుముందు సీలేరు కాంప్లెక్సులోని విద్యుత్ ఉత్పత్తి, సామర్థ్యం, గోదావరి డెల్టాకు నీటి విడుదల తదితర అంశాలపై స్థానిక జెన్‌కో అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు సూపరింటెండెంట్ ఇంజనీర్లు కేకేవీ ప్రశాంత్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి (పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు) ఈఈ ప్రభాకరరావు, ఏడీఈ వెంకటమధు, ఏఈఈ సురేశ్, ఎండీవో ఉమామహేశ్వరరావు, తహసీల్దార్ ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ దుర్జో, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |