ఆస్తి తగాదాల కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. వరుసకు తమ్ముళ్లు అయిన ఇద్దరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సీఐ ఎస్.కె.గఫూర్ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఎలమంచిలి పట్టణానికి చెందిన సున్నం సతీశ్‌కుమార్ బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. భార్యకు దూరంగా తులసీనగర్‌లో నివాసముంటున్నాడు. కాగా తన కుమారుడు సతీశ్‌కుమార్ ఈ నెల ఒకటో తేదీ నుంచి కనిపించడం లేదని అతని తల్లి రాజా నాగమణి మంగళవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యం కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు బుధవారం సతీశ్‌కుమార్ ఇంటిని పరిశీలించారు. క్లూస్ బృందం ఆధారాలు సేకరించి అనుమానం వ్యక్తం చేసింది. దీంతో అనుమానితులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో వరుసకు తమ్ముళ్లే అతనిని హత్య చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. గత నెల 27వ తేదీన సతీశ్‌కుమార్‌కు వరుసకు తమ్ముళ్లు అయిన సాయి మనోజ్‌కుమార్, డి.రాజేశ్‌లు అతని ఇంటికి వెళ్లారు. సతీశ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగి ఛాతీ, ముఖంపై పిడి గుద్దులు గుద్ది హత్య చేశారు. అదే రోజు రాత్రి అతని మృతదేహాన్ని కారులో ఎక్కించి ఎస్.రాయవరం మండలం దార్లపూడి సమీపంలోని పోలవరం కాలువ వద్ద నిర్మిస్తున్న ఆక్విడెక్టు కింద నిర్జీవ ప్రదేశంలో గోతిలో పూడ్చి పెట్టారు. సాయి మనోజ్‌కుమార్, డి.రాజేశ్‌లు పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించడంతో వారిద్దర్నీ తీసుకుని మృతదేహాన్ని పూడ్చిన ప్రదేశానికి అధికారులు చేరుకున్నారు. ఎస్.రాయవరం తహసీల్దారు విజయలక్ష్మి, వీఆర్వో, మృతుని కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించడంతో శవ పంచనామా పూర్తి చేసి మృతదేహాన్ని వారికి అప్పగించారు. నిందితులను అరెస్టు చేశారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని సీఐ గఫూర్ తెలిపారు.
![]() |
![]() |